క్యాన్సర్ స్క్రీనింగ్‌కు సర్వసన్నద్ధం కావాలి.. ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్
అమరావతి : జులై 29(మీడియా విజన్ ఏపీటీఎస్ )
నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు15 నుండి ప్రారంభించనున్నందున అందుకు సర్వసన్నద్ధం కావాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ స్పష్టం చేశారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుండి సోమవారం ఆయన అసంక్రమిక వ్యాధుల నివారణ మరియు నియంత్రణ జాతీయ కార్యక్రమం అమలు తీరును సమీక్షించారు. క్యాన్సర్ కేర్‌పై
ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. తొలి దశలో క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా వారి ప్రాణాల్ని కాపాడగలిగామన్న సంతృప్తి మిగులుతుందన్నారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కీమో థెరపీని అందుబాటులోకి తీసుకురావాలని, డే కేర్ సెంటర్లను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ విజయవంతమయ్యేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, అందుకోసం పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ప్రచారాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఇంటింటికీ కరపత్రాల్ని పంచడంతో పాటు పోస్టర్లు, బ్యానర్లు సిద్ధం చేయాలన్నారు. ప్రచారాన్ని చేపట్టేందుకు సమాచార పౌర సంబంధాల శాఖ, అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారాన్ని తీసుకోవాలని అధికారులకు కమీషనర్ సూచించారు. జన సమ్మర్ధ ప్రదేశాల్లో పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రచారం కోసం ఆర్టీసీ, రవాణా, మునిసిపల్ శాఖల సహకారాన్ని తీసుకోవాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ నాణ్యతా ప్రమాణాల్ని తెలుసుకునేందుకు గాను థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ యాప్ ను తయారుచేయాలన్నారు.
ఎంత మందికి స్క్రీనింగ్ చేశారు, అందులో అనుమానిత కేసులెన్ని, ధ్రువీకరించిన కేసులెన్ని అన్న సమాచారాన్ని బట్టి ఎంతమందికి చికిత్స చేయగలమనేది తేలుతుందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మెడికల్ ఆఫీసర్లు, సిహెచ్వోలు, ఎఎన్ఎంలు, ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ల కింద స్పెషలిస్ట్ డాక్టర్లకూ ఇప్పటికే శిక్షణ ఇచ్చామని అధికారులు కమీషనర్‌కు ఈ సందర్భంగా వివరించారు. ఎన్సీడీ సర్వేలో ఆగస్టు నుండి 18 ఏళ్లు పైబడివారికి కూడా మధుమేహం, బీపీ ఉన్నదీ లేనిదీ గుర్తించాలని కమీషనర్ సూచించారు. 104 వాహనాల్లో కచ్చితంగా మధుమేహ మందులుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ సెంటర్, పీహెచ్సీ ల వారీగా బిపి, మధుమేహం ఉన్నవారి వివరాలు అందుబాటులో ఉంటే మరింత సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతమున్న రోగుల సంఖ్య( ప్రెజెంట్ కేస్ బర్డన్ ), అంచనా వేసిన రోగుల సంఖ్య ( ఎస్టిమేటెడ్ కేస్ బర్డెన్ ) బట్టి రెంటి మధ్యా వ్యత్యాసాన్ని తెలుసుకోవాన్నారు. తాజా గణాంకాల్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఎన్సీడీ సర్వేకు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కమీషనర్ సూచించారు. ఎన్సీడీ సర్వేకు సంబంధించి ఇంకా 20 శాతం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.
*మానసిక సమస్యలపై మరింత శ్రద్ధ కనబర్చాలి : కమీషనర్*
నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల మరింత శ్రద్ధను కనబరచాలని కమీషనర్ సి.హరికిరణ్ అన్నారు. రాష్ట్రంలోని సిద్దార్థ మెడకల్ కాలేజ్ విజయవాడ, మెంటల్ హాస్పిటల్ వైజాగ్ లో ఉన్న టెలీమానస్ కేంద్రాల్లో అందుతున్న సేవలపై కమీషనర్ ఈ సందర్భంగా ఆరా తీశారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలందిస్తే భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రారంభించిన టెలీమానస్ సెంటర్లకు ఇప్పటి వరకు వివిధ మానసిక సమస్యలతో 51,528 మంది కాల్ చేశారని, 68 మందిని ఆత్మహత్యకు పాల్పడకుంగా కాపాడగలిగామని అధికారులు తెలిపారు. 24 గంటలూ టెలీమానస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని, 14416, 18008914416 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే కౌన్సెలర్లు కౌన్సెలింగ్ చేస్తారని అధికారులు తెలిపారు. మానసిక సమస్యల్ని పరిష్కరించడంలో టెలీమానస్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎన్సీడీ , హెచ్డబ్ల్యుసి రాష్ట్ర నోడలాధికారి శ్యామల, పీఓలు డాక్టర్ నర్సింగరావు, సుబ్రహ్మణ్యం, కన్సల్టెంట్లు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
u