Blog

ఘనంగా ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా మహాసభలు– సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజుకు సత్కారం

విశాఖపట్నం, జూలై 29: (మీడియా విజన్ ఏపీటీఎస్) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) విశాఖపట్నం జిల్లా మహాసభలు గోపాలపట్నంలోని కుమారి కల్యాణ మండపంలో సోమవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావును యూనియన్ నాయకులు, సభ్యులు సత్కరించారు. 2001-02 సంవత్సరాల్లో నిమ్మరాజు విశాఖలో ఆంధ్రభూమి బ్యూరో చీఫ్ గా పనిచేశారు. అదేకాలంలో యూనియన్ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, అక్రెడిటేషన్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. యూనియన్ సీనియర్ నేత ఎం.ఆర్.ఎన్ వర్మ కన్వీనర్ గా విశాఖ అర్బన్ కమిటీని ఏర్పాటు చేసి, అప్పట్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్ట్స్, నాన్ జర్నలిస్ట్స్ ఇళ్లస్థలాల సమస్యలను నాటి జాయింట్ కలెక్టర్ ఎం.టి.కృష్ణబాబు దృష్టికి తీసుకెళ్లి, కొంతమేర పరిష్కారానికి కృషి చేశారు. జర్నలిస్టులపై దాడులు జరిగినపుడు అప్పటి నగర పోలీస్ కమిషనర్ ఎ.కె ఖాన్ దృష్టికి తీసుకెళ్లి దోషులకు శిక్షపడేలా చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక మూతబడిన సందర్భంలో జర్నలిస్టులు, ఉద్యోగులకు మద్దతుగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాడు ఆంధ్రభూమిలో నిమ్మ రాజుతో కలిసి పనిచేసిన, నాడు కొత్తగా నియమితులై నేడు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పలువురు నాటి మధుర జ్ఞాపకాలను ఓసారి మననం చేసుకుంటూ చలపతిరావును అభినందించారు. రాష్ట్ర సమాచార శాఖ ప్రస్తుత అదనపు డైరెక్టర్ శ్రీమతి ఎల్.స్వర్ణలత నాడు డిప్యూటీ డైరెక్టర్ గా జర్నలిస్టు మిత్రులకు ఎంతో తోడ్పాటు అందించారని ఈ సందర్భంగా పలువురు కృతజ్ఞతలు ప్రకటించారు.ఈ మహాసభల్లో ఐజేయు కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఐజేయు కార్యవర్గ సభ్యుడు, సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షుడు ఏచూరి శివ, సీనియర్ నేత ఎం.ఆర్.ఎన్ వర్మ, జిల్లా మాజీ అధ్యక్షుడు కే రాము, విశాఖ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.రామచంద్రరావు, కె.చంద్రమోహన్, కోశాధికారి కిల్లి ప్రకాశరావు, స్థానిక నాయకులు వాల్మీకి నాగరాజు, డి.హరనాథ్, జి.అచ్యుతరావు, కె.చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button