విశాఖపట్నం ఆగస్టు8: మీడియావిజన్ ఏపీటిఎస్ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీవన్ ధాన్ పథకం పై జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంద్ర ప్రసాద్ కోరారు. జాతీయ అవయువదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమావేశ మందరంలో ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వానికి లభించిన జీవన్‌ధాన్ అవార్డును రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు స్వీకరించారు. ఈ సందర్భంగా నే గురువారం జీవన్దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు విశాఖ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అవార్డును అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి అవయవ దానం పై ప్రజలకు అవగాహన కల్పించడంతో అత్యవసర పరిస్థితుల్లో పలువురికి ప్రాణదానం చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దేశంలోనే తొలిసారి ఆంధ్ర రాష్ట్రానికి జీవన్దాన్ అవార్డు లభించడం పట్ల డాక్టర్ రాంబాబు చేస్తున్న కృషిని కలెక్టర్ ప్రశంసించారు.ఈ సందర్భంగా ఏపీ జీవన్‌ధాన్ కో-ఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు మాట్లాడుతూ ఇదే స్పూర్తితో విద్యార్ధి దశ నుంచి ప్రత్యేకంగా అవయువదానంపై ప్రజలకు అవగాహన కల్పించేలా కృషి చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశాలను పాటిస్తూ ఈ పధకాన్ని మరింత పక్కగా అమలు చేస్తామన్నారు.