Blog

1వ తేదీనే పింఛన్లు పంపిణీ కావాలి….జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్

విశాఖపట్నం జులై 29 ( మీడియా విజన్ ఏపీటీఎస్ )

జిల్లాలోని పింఛనుదారులందరికీ ఆగస్ట్ 1వ తేదీనే పింఛన్లు పంపిణీ కావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.అందుబాటులో లేని లబ్ధిదారులకు రెండవ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పింఛన్ల పంపిణీపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున యుసీడీ, డిఆర్డిఏ సంయుక్తంగా పింఛన్లు పంపిణీని చేపట్టాలన్నారు. 1,2 తేదీల్లో మొత్తం పింఛన్లు పంపిణీ కావాలని, ఈ విషయాన్ని చెత్తను సేకరించే వాహనాల ద్వారా ప్రతి గ్రామం, వార్డులో ముందస్తు ప్రచారం చేపట్టాలని అన్నారు. పింఛను డబ్బులను ఈ నెల 31న డ్రా చేసి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆగస్ట్ 1వ తేదీ ఉదయం 5.00గం.ల నుంచి పింఛన్లు పంపిణీ కావాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లే అవకాశం ఉన్నందున, పింఛన్ల పంపిణీపై వారికి ముందస్తు సమాచారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ప్రత్యేక ఉప కలెక్టర్ సీతారామ మూర్తి, రెవిన్యూ డివిజనల్ అధికారి డి.హుస్సేన్ సాహెబ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎం.ఎస్. శోభా రాణి,యుసీడీ ప్రోజెక్ట్ డైరెక్టర్ ఎం.వి.డి.ఫణి రామ్,ఎల్.డి.ఎం ఎం.శ్రీనివాస్, డి.ఎల్.డి.ఓ ఆర్.పూర్ణిమాదేవి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button