- విశాఖపట్నం : చెన్నా ప్రమోదిని
(బి.ఏ, ఎల్ ఎల్. బి)
ఫ్రీ లీగల్ అవేర్నెస్ పర్సన్
మిత్రులారా నేటి సమాజంలో అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు, చట్టబద్దమైన వ్యక్తులు వారి విధులు, దేశ పౌరులు చేసే చర్యలు లేదా పలు అంశాలు చట్టానికి లోబడే ఉండాలి. లేని పక్షంలో చట్టపరమైన సంస్థలు, న్యాయస్థానాల నుంచి పలు రకాలైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశ ప్రజలు సుభిక్షంగా, స్వేచ్ఛగా బ్రతికేందుకు, నివసించేందుకు కొన్ని ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం మనకు ప్రసాదించింది. అటువంటి మన ప్రాథమిక హక్కులకు ఎవరైనా…భంగం వాటిల్లే విధంగా చేస్తే వారిపై మనం హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో ఈ రిట్ పిటిషన్ వేసి తద్వారా మన ప్రాథమిక హక్కులను కాపాడుకోవచ్చును. కొన్ని సందర్భాల్లో చాలామంది యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినా…. ఎలా రక్షణ పొందాలో తెలియదు. ఒకవేళ తెలిసినా పెద్దవారితో పెట్టుకుంటే ఏమవుతుందో అన్న సందేహం ఉంటుంది. కానీ మిత్రులారా మనం ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే… సమాజంలో వ్యక్తిగత అంతస్తుల్లో, పేద, గొప్ప, వీరు అధికారులు, వీరు పెద్దవారు, వారు చిన్నవారు అనే తేడాలు ఉంటుంది ఇది సహజం. కానీ మనం నీతిగా, నిజాయితీగా ఉండి, మనతప్పు లేకుండా… వేరే వారు సో కాల్డ్ పెద్దవారు మన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే.. ఈ రిట్ పిటిషన్ ను వారిపై హై కోర్టులో లేదా కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టులో వేసి చూడండి. తప్పు చేసిన వాడు బెంజ్ కారులో తిరిగేవాడు అయినా… సరే, ఒక్క సారి కోర్టు మెట్లెక్కితే, గెంజి తాగే నీతో పాటు సమానంగా కోర్టు హాల్లో న్యాయమూర్తి ముందు నేల పైనే నిలబడాలి. తప్పు చేసిన వాడు బోయింగ్ విమానాల్లో తిరిగే పెద్దమనిషి అయినా సరే… కోర్టులో న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే… ఇదే న్యాయానికి, చట్టానికి ఉన్న పవర్. న్యాయం, చట్టం ముందు అందరూ.. సమానులే. కాబట్టి “పవర్ కమ్స్ ఫ్రమ్ సిన్సియారిటి” అనే వాక్యాన్ని మనం మరువకూడదు. మన బలం, బలగం నిజాయితీయే అయి ఉండాలి. మనం ఏ తప్పూ చేసి ఉండకూడదు.
ఇక రిట్ అంటే తెలుసుకుందాం. భారతదేశ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు వాటి న్యాయపరమైన అధికారంతో జారీ చేసే అధికారిక వ్రాతపూర్వక ఉత్తర్వు అని అర్థం .
రిట్ అనేది ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు లేదా న్యాయస్థానాలకు, ప్రభుత్వ అధికారులకు ఓ అంశంపై చర్య తీసుకోమని లేదా కార్యకలాపాలు చేయకుండా ఆపమని ఆదేశించడం. మొత్తం భారతదేశ న్యాయ వ్యవస్థలోమొత్తం 5 రకాల రిట్లు ఉన్నాయి: 1) హెబియస్ కార్పస్, 2) మాండమస్, 3)క్వో-వారంటో, 4) సెర్టియోరారి, 5) ప్రొహిబిషన్ (నిషేదం) భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే, పరిరక్షించేందుకు ఈ యొక్క రిట్ పిటిషన్ ను హై కోర్టులో గాని, సుప్రీం కోర్టులో గాని పౌరులు దాఖలు చేయవచ్చు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ద్వారా రిట్లు (ఆదేశాలు) జారీ చేయబడతాయి.
భారత రాజ్యాంగంలోని పార్ట్ III (ఆర్టికల్ 12-35)లో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులు పౌర స్వేచ్ఛలకు హామీ ఇస్తున్నాయి , భారతీయులందరూ భారతదేశ పౌరులుగా శాంతి , సామరస్యంతో తమ జీవితాలను గడపవచ్చు . ఈరకంగా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను “ప్రాథమిక హక్కులు” అని పిలుస్తారు. ఇంతకు మునుపు మొత్తం 7 ప్రాథమిక హక్కులు ఉండేవి వీటినుంచి 1978 లో 44 వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. చట్టబద్ధమైన హక్కుగా ఆస్తి హక్కు మార్పు చెందింది.
కాబట్టి ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి:
- సమానత్వ హక్కు (ఆర్టికల్ 14–18)
- స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 19–22)
- దోపిడీకి వ్యతిరేకంగా హక్కు (ఆర్టికల్ 23–24)
- మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25–28)
- సాంస్కృతిక మరియు విద్యా హక్కులు (ఆర్టికల్ 29–30)
- రాజ్యాంగ పరిష్కారాల హక్కు (ఆర్టికల్ 32–35) ఉన్నాయి.
ప్రాథమిక హక్కులకు బంగంకలిగితే భారత రాజ్యాంగం, ఆర్టికల్ 32 మరియు 226 ప్రకారం, ఏ వ్యక్తి అయినా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించే హక్కును కలిగి ఉన్నాడు.
1) హెబియస్ కార్పస్ :
‘హెబియస్ కార్పస్’ అంటే చట్టవిరుద్ధంగా అరెస్టు చేయబడిన, నిర్బంధించబడిన లేదా ఖైదు చేయబడిన వ్యక్తిని విడుదల చేయడానికి ఈ రిట్ ఉపయోగించబడుతుంది . ఈ హెబియస్ కార్పస్ రిట్ కారణంగా, అలా నిర్బంధించబడిన వ్యక్తిని అతని నిర్బంధం యొక్క చట్ట బద్ధతను పరిశీలించడానికి కోర్టులో హాజరుపరిచమని పోలీసులను కోర్టు నిర్దేశిస్తుంది. అరెస్టు చట్ట విరుద్ధమని కోర్టు భావిస్తే, ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని అదేశిస్తుంది.
ఉదాహరణ:
ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన 24 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ హాజరు పరచలేదు అప్పుడు ఆ అరెస్టయిన వ్యక్తికి సంబంధించిన వారు హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్
ను, నిర్బంధంలో ఉన్న వ్యక్తి స్వయంగా లేదా అతని తరపున బంధువులు లేదా స్నేహితులు దాఖలు చేయవచ్చు. ఇది ప్రభుత్వ అధికారులు మరియు వ్యక్తులు ఇద్దరికీ వ్యతిరేకంగా జారీ చేయబడుతుంది.
2)మాండమస్ రిట్ : దిగువ కోర్టులు, ట్రిబ్యునల్, ఫోరమ్ లేదా ఏదైనా పబ్లిక్ అథారిటీని తమ విధిని సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనా లేదా పూర్తి చేయని ఏదైనా చర్యను చేయమని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించదానికి ఉపయోగపడును.
ప్రభుత్వ అధికారి చట్టం ప్రకారం నిర్వహించాల్సిన బాధ్యత చేయకుండా పౌరులను ఇబ్బంది పెడితే, మాండమస్ రిట్ పిటిషన్ వేయొచ్చు.
ఉదాహరణ: ఒక ఎమ్మార్వో ఆఫీసులో పౌరులకు చట్టప్రకారం జరగాల్సిన ఏదైనా పనిని జరగకుండా చేయుట, ఆ ప్రభుత్వ అధికారి తన విధులను సక్రమంగా చేయకుండా పౌరులను ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉన్నప్పుడు ఈ పిటిషన్ వేయొచ్చు. ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది.
3) క్వో వారంటో రిట్ : క్వో-వారంటో యొక్క రిట్ ఒక వ్యక్తి తనకు అర్హత లేకపోయినా ప్రభుత్వ కార్యాలయంలో నియమించబడడం. అర్హత లేకపోయినా అధికారిగా చలామణి అవడం. ఈ పరిస్థితుల్లో అర్హత లేని అతను ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించకుండా నిరోధించడానికి ఈ రిట్ జారీ చేయబడును.
‘క్వో వారంటో’ అంటే ‘ఏ వారెంట్ ద్వారా’ అని అర్థం . ఈ రిట్ ద్వారా, ప్రభుత్వ కార్యాలయాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఆ పదవిని ఏ అధికారం క్రింద కలిగి ఉన్నారో చూపించమని కోర్టు ఆదేశిస్తుంది . ఆ పదవిని నిర్వహించేందుకు వ్యక్తికి అర్హత లేదని తేలితే, అతన్ని దాని నుండి తొలగించవచ్చు. దీని లక్ష్యం ఏమిటంటే, ఒక వ్యక్తి తనకు అర్హత లేని పదవిని నిర్వహించకుండా నిరోధించడం, ఇది ప్రైవేట్ కార్యాలయానికి వర్తించదు.
ఉదాహరణ: ఏదైనా ప్రభుత్వకార్యాలయంలో అర్హతలేని అధికారి ఉద్యోగం పొంది విధులు నిర్వహిస్తే, అది గమనించిన ఏ వ్యక్తి అయినా ఈ క్వో వారంటో రిట్ పిటిషన్ ను హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో వేయొచ్చు.
4) రిట్ ఆఫ్ సెర్టియోరారి :
‘సెర్టియోరారి’ అంటే ‘ధృవీకరణ’ . ఒక నివారణ వ్రాత. దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికారాలకు మించిన ఉత్తర్వును జారీ చేసిందని లేదా చట్ట తప్పిదానికి పాల్పడిందని హై కోర్టు లేదా సుప్రీం కోర్టు అభిప్రాయపడినప్పుడు , క్రింది కోర్టులకు సర్టియోరి రిట్ జారీ చేయబడుతుంది. ఈ రిట్ దిగువ కోర్టులు, ట్రిబ్యునల్లు లేదా ఫోరమ్లు కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు, ఫైల్లు మరియు సంబంధిత పత్రాలను తదుపరి సమీక్ష కోసం ఉన్నత న్యాయస్థానాలకు అందించాలని లేదా అవసరమైతే వాటిని రద్దు చేయాలని ఆదేశిసిస్తుంది.
ఉదాహరణ:
• ఒక సబార్డినేట్ కోర్టు అధికార పరిధి లేకుండా లేదా దాని ఉనికిలో లేని తీర్పులు ఇవ్వడం లేదా
• క్రింది స్థాయి న్యాయస్థానం అధికార పరిధిని అధిగమించడం లేదా అధిగమించడం ద్వారా తన అధికార పరిధిని మించి వ్యవహరించినప్పుడు, లేదా
• ఒక సబార్డినేట్ కోర్టు చట్టం లేదా విధివిధానాల నియమాలను విస్మరించినప్పుడు, లేదా
• ఒక సబార్డినేట్ కోర్టు సహజ న్యాయం యొక్క సూత్రాలను ఉల్లంఘించినప్పుడు సర్టియోరరీ పిటిషన్ ద్వారా క్రింది కోర్టులకు చట్టబద్ధంగా నడచుకొనుటకు ఉత్తర్వులు ఇస్తుంది.
5) రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ (నిషేదం): దిగువ కోర్టులు, ట్రిబ్యునల్లు లేదా ఫోరమ్లు తమకు అధికార పరిధి లేని కేసు విచారణను నిషేధించాలని సుప్రీం కోర్టులు లేదా హైకోర్టుల ద్వారా ఈ రిట్ జారీ చేయబదుతుంది.
దిగువ కోర్టులు, ట్రిబ్యునల్లు మరియు ఇతర పాక్షిక-న్యాయ అధికారులు తమ అధికారానికి మించి ఏదైనా చేయకుండా నిషేధించడానికి కోర్టు ద్వారా నిషేధం యొక్క రిట్ జారీ చేయబడింది . ఇది డైరెక్ట్ ఇనాక్టివిటీకి జారీ చేయబడుతుంది. మరియు ఆ విధంగా కార్యాచరణను నిర్దేశించే మాండమస్ నుండి భిన్నంగా ఉంటుంది.
దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ అధికార పరిధి లేకుండా లేదా పరిదికి మించి లేదా సహజ న్యాయ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు లేదా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఇది జారీ చేయబడుతుంది. దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ స్వయంగా అల్ట్రా వైర్ అయిన చట్టం ప్రకారం పనిచేసినప్పుడు కూడా ఇది జారీ చేయబడుతుంది.
ఎవరు రిట్ పిటిషన్ ను దాఖలు చేయవచ్చు :
రాష్ట్రంచే పౌరుల ప్రాథమిక హక్కులకు బంగంవాటిల్లితే ఏ వ్యక్తి అయినా రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు . అందువల్ల, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రానికి వ్యతిరేకంగా తమ హక్కులను అమలు చేయడానికి లేదా రక్షించడానికి రిట్ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. ఈ పిటిషన్లు వెయ్యడానికి
ముందుగా వారి రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళాలి ఆ తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అయితే కొన్ని సందర్భాల్లో నేరుగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే, ముందుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదో పిటిషనర్ వివరించాలి.
రిట్ పిటిషన్ ఎక్కడ దాఖలు చేయవచ్చు?
ఆర్టికల్ 32 ప్రకారం , సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు . పిటిషనర్ తన ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు రుజువు చేయగలిగితే మాత్రమే సుప్రీం కోర్టు రిట్ జారీ చేయగలదు. ప్రాథమిక హక్కు ఉల్లంఘన విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు రాజ్యాంగంలోని పార్ట్ IIIలో ఉన్నందున అది ప్రాథమిక హక్కు అని గమనించడం ముఖ్యం.
ఆర్టికల్ 226 ప్రకారం , ఏదైనా హైకోర్టు ముందు రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు.
ఒకవేళ రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించినట్లయితే ఆర్టికల్ 32ని సస్పెండ్ చేయవచ్చు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ ఆర్టికల్ 226ని సస్పెండ్ చేయడం కుదరదు.
ఆర్టికల్ 32 మరియు 226 రెండూ భారత రాజ్యాంగం కింద అందించిన ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి మార్గాలను అందిస్తాయి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన ఏ వ్యక్తి అయినా సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో రిట్ దాఖలు చేయవచ్చును.
కాబట్టి నేడు చాలా అంశాలు కుటుంబ పంచాయితీలు, గ్రామ పెద్దల, కులపెద్ద ల పంచాయితీలు దాటుకొని చివరకు తగిన న్యాయంకోసం కేసుల ద్వారా కోర్టులకు చేరుకోవడం గమనిస్తున్నాం. ఈ కాలానికి అనుగుణంగా అందరూ… చట్టాన్ని తెలుసుకోవడం విధిగా భావించి దేశంలో సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని కోరుకుందాం.