Blog

రంగసాయి నాటక సంఘం 14 వ వార్షికోత్స వేడుకలు…తనికెళ్ళ భరణి కి జీవన సాఫల్య పురస్కార ప్రదానం…

విశాఖపట్నం జులై 30 (కల్చరల్ ప్రతినిధి )

నాటక రంగ ప్రోత్సాహమే లక్ష్యంగా 2010 ఆగస్టు 1న ప్రారంభమైన రంగసాయి నాటక సంఘం ఈ 14 సంవత్సరాల ప్రయాణంలో నాటక రంగానికి ఎనలేని సేవలు అందించింది. ఎన్నో ప్రయోగాత్మక నాటకాలు నాటికలు, నటశిక్షణా శిబిరాలు, పుస్తకావిష్కరణలు, సురభి పౌరాణిక పద్య నాటకాలు ఇలా ఎన్నో నిర్వహించిన రంగసాయి నాటక సంఘం నేడు 14వ వార్షికోత్సవ వేడుకలకు సమాయత్తమయింది.ఆగస్టు 1 గురువారం సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియం,విశాఖపట్నం నందు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ పరంపరలో వెండి తెరకే ఆభరణంగా వెలుగొందుతున్న రంగస్థల నటులు, రచయిత, దర్శకులు, మాన్యశ్రీ తనికెళ్ల భరణికి “రంగసాయి జీవన సాఫల్య పురస్కారాన్ని” అందజేస్తున్నాము. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రంగస్థల ప్రముఖులను మరో ఐదుగురిని ఎంపిక చేసి రంగసాయి థియేటర్ అవార్డును ఈ సంవత్సరం నుండి ప్రవేశపెట్టింది. ఈ తొలి పురస్కారాలను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎం. భాషా, యువ నటుడు వి. సతీష్ కుమార్, నాటక ప్రోత్సాహకులు పరిషత్తు నిర్వహకులు బుద్ధాల వెంకట రామారావు, పౌరాణిక రంగస్థల నటీమణి శ్రీమతి కె. మంగాదేవి, అతిపిన్న వయసు నుండి పౌరాణిక పాత్రలను ధరించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొంది ప్రభుత్వ నంది పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి బగాది రితిష్ చంద్ లకు ఈ అవార్డును ఇవ్వనుంది. అలాగే మరొక ప్రయోగంగా పది సంవత్సరాల లోపు బాల బాలికల చే “సంక్షిప్త భారతం” అను పౌరాణిక ఏకపాత్రల ఏకాంకికను ప్రదర్శింపజేస్తున్నాం. ఈనాటిక రచన : సీనియర్ జర్నలిస్ట్ కళాసరిత్సాగరం అయల సోమయాజుల జోగారావు, దర్శకత్వం : శ్రీమతి గంటి సీతామహాలక్ష్మి, పర్యవేక్షణ నవరస మూర్తి వ్యవహరిస్తున్నారు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు కావున విశాఖ నగర ప్రజలు, నాటక సినీ అభిమానులు విరివిగా విచ్చేసి కార్యక్రమం విజయానికి చేయూత అందించవలసిందిగా నిర్వాహకులు బాదంగీర్ సాయి, ఎన్.ఎన్.ఆర్. తెలియజేసారు. మీడియా సమావేశంలో శ్రీమతి శివజ్యోతి, రవి బ్రహ్మ, నవరసమూర్తి పాల్గొన్నారు.

Related Articles

Back to top button